బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోసం నిప్పంటించుకున్న వ్యక్తి మృతి..!

Thursday, November 5th, 2020, 09:58:24 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అయ్తే 44 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ మృత్యువుతో పోరాడి నేడు తుదిశ్వాస విడిచాడు. అయితే శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచంద్రారెడ్డి మరియు పలువురు నేతలు అతడిని పరామర్శించారు.

అయితే దుబ్బాక ఉప ఎన్నిక నేపధ్యంలో నోట్ల కట్టలు బయటపడడం, అవి బీజేపీ నేతలవే అని ఆరోపణలు రావడంతో అధికార పార్టీ, పోలీసులు కుమ్మకై కావాలనే బీజేపీ నేతలపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని నిరసన తెలిపేందుకు యత్నించిన బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను తట్టుకోలేకపోయిన శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. బీజేపీ కోసం, బండి సంజయ్ కోసం ఏదైనా చేస్తానని, బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ఏమీ చేయలేడని శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశాడు.