గ్రేటర్ ఎన్నికల ముందు రేవంత్‌కి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముఖ్య అనుచరుడు..!

Monday, November 16th, 2020, 04:15:06 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానం తమదే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోయింది. దీంతో ఇక టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ భావిస్తూ, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపును కొనసాగించి సత్తా చాటాలని పావులు కదుపుతుంది. ఈ నేపధ్యంలో వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలను, అసంతృప్తులను ఆకర్షిస్తూ వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.

అయితే గ్రేటర్ ఎన్నికలకు ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా బీజేపీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కుడి భుజంగా పేరున్న కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఎల్.బీ.నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సుధీర్ రెడ్డి కొద్ది రోజులకు టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో అప్పటి నుంచి కొప్పుల నర్సింహారెడ్డి ఎల్.బీ.నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే నిన్న రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితర నేతలతో కొప్పుల నర్సింహారెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలవగా ఆయనకు కిషన్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో అత్యధిక భాగం గ్రేటర్ పరిధిలోనే ఉండడంతో గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను రేవంత్ రెడ్డికే అప్పగిస్తాన్న ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నేపధ్యంలో కొప్పుల నరసింహారెడ్డి వంటి కీలక నేతను కోల్పోవడం రేవంత్ వర్గానికి షాక్ అనే చెప్పాలి.