బిగ్ రిలీఫ్: జగన్ సర్కార్ జీవోను సమర్ధించిన హైకోర్ట్..!

Tuesday, June 2nd, 2020, 12:47:45 AM IST


ఏపీ హైకోర్ట్‌లో జగన్ ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సచివాలయాలకు రంగుల నుంచి మొదలుకొని నిమ్మగడ్డ ఇష్యూ వరకు హైకోర్ట్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. అయితే చాలా రోజుల తరువాత ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ సమర్ధించించింది. దీంతో జగన్ సర్కార్‌కు హైకోర్ట్‌లో బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి.

అయితే ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకుకై జగన్ ప్రభుత్వం గత డిసెంబరులో జీవో 2430ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జీవో ప్రకారం ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను ప్రసారం చేసే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

అయితే ఈ జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తప్పుబట్టింది. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు, మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఈ జీవో తీసుకురాలేదని, మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రజలకు చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న ప్రభుత్వ తరపు న్యాయవాదితో న్యాయస్థానం ఏకీభవించింది. మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు లోబడే వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.