ఏపీ సీఎం జగన్కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భారీ ఊరట లభించింది. అయితే ఈ కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి శుక్రవారం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సీఎం జగన్కు, ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని ఇప్పటికే కోర్టుకు పలు పిటీషన్లు దాఖలు చేసుకున్నారు.
అయితే ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు, వారిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులను వెంటనే విచారణ చేపట్టాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వగా, హైకోర్ట్ కూడా కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. తాము ఎలాంటి విచారణకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును ఈ నెల 12కి వాయిదా వేసింది.