లక్ష్మీ పార్వతికి ఏసీబీ కోర్టు షాక్.. చంద్రబాబుకు రిలీఫ్..!

Tuesday, May 4th, 2021, 01:04:03 AM IST

వైసీపీ మహిళా నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతికి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆమె వేసిన పిటీషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని 2005లో ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులు పెంచుకున్నారని దీనిపై విచారణ జరపాలని ఆమె పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్‌పై 2005లో హైకోర్టు స్టే ఇవ్వగా, పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తివేయాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేశారు. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు నిర్ణయించి మళ్లీ విచారణను కొనసాగించింది. అయితే తాజాగా ఏసీబీ కోర్టు కూడా ఈ పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఈ పిటిషన్‌కు అర్హతలేదని, తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుకు ఇది ఒకింత ఊరటనిచ్చే అంశమనే చెప్పుకోవాలి.