ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై జగన్ సర్కార్‌కు ఊరట..!

Thursday, November 26th, 2020, 05:05:42 PM IST

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసినప్పుడు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ని ఆశ్రయించిన క్యాట్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్దిస్తూ ప్రభుత్వానికే మద్ధతు తెలిపింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ను ఎత్తేసింది. అంతేకాదు ఏబీనీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. నేడు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏబీ సస్పెన్షన్ ఎత్తేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే మూడు వారాల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేస్తూ, ఛార్జిషీట్‌ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.