జగన్ సర్కార్‌కి గుడ్‌న్యూస్.. మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

Friday, July 31st, 2020, 04:49:09 PM IST

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. తాజాగా ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావించి రాజధాని వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించినా, శాసనమండలిలో మాత్రం ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించిన అది జరగలేదు.

అయితే మూడు నెలలు గడిచిన తర్వాత అదే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రెండో సారి శాసనసభలో ఆమోదించి మండలికి పంపింది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ మళ్ళీ అభ్యంతరం తెలపడంతో ఆగిపోయాయి. అయితే నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఉత్కంఠత ఉండగా తాజాగా రెండు బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో జగన్ ప్రభుత్వానికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి.