బ్రేకింగ్: నగర శివారులోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..!

Saturday, December 12th, 2020, 02:39:11 PM IST

హైదరాబాద్ నగర శివారులో భారీ పేలుడు సంభవించింది. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. భారీ శభ్దాలతో పేలుడు జరగడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

అయితే పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 120 మంది కార్మికులున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన పొగలతో శ్వాస ఆడక మరొకొందరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఇంకా ఎంత మంది కార్మికులు లోపల ఉన్నారు, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.