సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క లేఖ.. ఏం డిమాండ్ చేశారంటే?

Thursday, January 14th, 2021, 03:00:03 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చాక యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్పింది విని రోడ్డుపై బైఠాయించి నిరసనలు కూడా తెలిపారని గుర్తు చేశారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.

అయితే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించి తీరాల్సిందేనని భట్టి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత అవసరాల కోసం అన్నదాతల భవిష్యత్‌ను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలికారు. అంతేకాదు విద్యుత్‌ చట్టాలపై చేసిన విధంగా సాగు చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని లేఖ ద్వారా కోరారు. అయితే కేంద్రం ఇప్పటికైనా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.