సీఎంవా లేక భూముల బ్రోకర్‌వా.. కేసీఆర్‌పై భట్టి సీరియస్..!

Sunday, September 20th, 2020, 10:00:19 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. నేడు రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ భూ భాదిత రైతుల సమావేశంలో పాల్గొన్న భట్టి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రివా లేక భూముల బ్రోకర్ వా అని నిలదీశారు. నీ లాంటి వాళ్ళను ఎంతో మంది చూసామని ఆనాడు ఇందిరమ్మ పేదలు కోసం భూములు కేటాయిస్తే, కేసీఆర్ దళారీగా మారి ఆ భూములను కార్పోరేటర్లకు పంచుతున్నారని అన్నారు.

అయితే భూమికి రైతులకు భావోద్వేగపూరిత బంధం ఉందని, అది లాక్కుంటే సహించేది లేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం పంపిణీ చేసిన 8 వేల ఎకరాలు, రైతుల 12 వేల ఎకరాలు మొత్తంగా 20 వేల వ్యవసాయ భూములను ఫార్మాసిటికి ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు, పేదలు, భూమిలేని నిరుపేదల కోసం ఇచ్చిందని వారికి అన్యాయం చేస్తామంటే కాంగ్రెస్ నాయకులం చూస్తూ ఊరుకోమని అన్నారు.