ఓటమి భయంతోనే హరీశ్ రావు దుబ్బాక లో మకాం – భట్టి విక్రమార్క

Wednesday, October 14th, 2020, 03:00:50 AM IST


తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక అంశం హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ తెరాస మరియు ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ లు కూడా ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన కీలక నేత భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను హడావిడిగా పెట్టారు అని భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నేపధ్యంలో అధికార పార్టీ తమకు నచ్చిన బిల్లులను ఆమోదం చేసుకున్నారు అని, ధరణి పోర్టల్ పై ఉన్న అనుమానాలను ఇంకా క్లియర్ చేయలేదు అని, వెబ్ సైట్ లో చాలా తప్పులు ఉన్నాయి అని భట్టి విక్రమార్క తెలిపారు. ఒకరి భూమిని మరొకరు ధరణి పోర్టల్ లో ఎంట్రీ చేసుకుంటే, అసలైన పట్టాదారు తన భూమిని ఎంట్రీ చేయించాలి అంటే తీసుకోవట్లేదు అని అన్నారు. ఇందులో తప్పులు సరి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తప్పు చేస్తోంది అని తెలిపారు. అంతేకాక శాసన సభ లో ప్రతిపక్ష పార్టీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు అని, అసెంబ్లీ సంప్రదాయాల్ని పాటించడం లేదు అని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు కి ఓటమి భయం పట్టుకుంది అని, అందుకే అసెంబ్లీ కి రాకుండా దుబ్బాక లో నే మకాం వేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.