ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నాం – భట్టి విక్రమార్క

Monday, September 14th, 2020, 10:46:57 PM IST


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన విధానం పై, తీసుకుంటున్న నిర్ణయాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గన్ పార్క్ వద్ద మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అధోగతి పాలు చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.పెద్ద ఎత్తున అప్పులు చేసే కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.అయితే కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90 శాతం నుండి 200 శాతానికి పెంచుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం ద్వారా రెవెన్యూ రిసిప్ట్స్ కి లక్షా పది వేల కోట్లు గ్యారంటీ పెట్టారు అని ఆరోపణలు చేశారు.

అయితే ఇప్పటికే ఉన్న అప్పులతో పాటుగా, ఈ అప్పులు కూడా కలిపి 2020 నాటికి 5,87,536 కోట్లు అవుతుంది అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నాం అంటూ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్ లో ప్రజల పై మరింత భారం పడుతుంది అని, ప్రభుత్వ విధానాల పై పోరాడతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.