కరోనా టీకాలకు భారత్‌ భారీ ఆర్డర్.. ఏకంగా 160 కోట్ల డోసులు..!‌

Saturday, December 19th, 2020, 08:44:34 AM IST

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే పలు టీకాలు మూడ దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. అయితే టీకాకు అనుమతులు వచ్చిన వెంటనే ఉత్పత్తి మొదలుపెట్టేందుకు అనేక ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. అయితే అన్ని అనుమతులు రాగానే వాటిని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు టీకా అభివృద్ధి సంస్థలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌ 160 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే సుమారు 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున వ్యాక్సిన్‌ అందించవచ్చని నిపుణులు అంచనా వేశారు. యురోపియన్‌ యూనియన్‌ ఇప్పటివరకు 106 కోట్ల డోసులకు ఆర్డర్ ఇవ్వగా, అమెరికా 91 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది.