సర్వే రిపోర్ట్: ఉత్తమ సీఎంలలో జగన్ ముందంజ.. వెనకబడ్డ కేసీఆర్..!

Saturday, January 16th, 2021, 11:35:45 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతున్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు దేశంలోనే బెస్ట్ సీఎంల జాబితాలో టాప్ 5లో నిలిచిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వెనకబడిపోయారు. దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఏబీపీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో తొలి స్థానంలొ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్, నాలుగో స్థానంలో కేరళ సీఎం విజయన్, ఐదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు.

అయితే చివరి స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిలవగా, చివరి నుంచి నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచినట్టు సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే చెప్పాలి. గతేడాది దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం, ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నట్టు స్పష్టం అవుతుంది.

ఇక ఈ ఏడాది నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఈ సర్వే కాస్త నిరాశను కలిగించందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మాత్రం వరుస సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తన గ్రాఫ్‌ను మరింత మెరుగుపరుచుకున్నట్టు తెలుస్తుంది.