బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్..!

Saturday, January 2nd, 2021, 02:59:45 PM IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం సౌరవ్ గంగూలీ వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన అస్వస్థతకి గురై కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన దాదాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం గంగూలీకి యాంజియోప్లాస్టీ సర్జరీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గంగూలీ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. దాదా త్వరగా కోలుకోవాలంటూ అందరూ కోరుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందిస్తూ గుంగూలీకి గుండె పోటు వచ్చిందన్న వార్త తనను బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.