జనగామ ఘటనపై బండి సంజయ్ ఫైర్.. 24 గంటల డెడ్‌లైన్..!

Wednesday, January 13th, 2021, 01:07:29 AM IST

జనగాంలో బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కొంత మంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని అన్నారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, సీఐపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాదు రేపు చలో జనగామకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇకపోతే జనగాంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. అయితే తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.