పార్టీనీ వీడుతున్న టీఆర్ఎస్ నేతలు.. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలోకి..!

Sunday, January 3rd, 2021, 02:00:00 AM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెట్టిన బీజేపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసిన టీఆర్ఎస్ నేతలు రేపు హైదరాబాద్‌లో బండి సంజయ్, ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, ఎన్నికలుంటేనే సీఎం కేసీఆర్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుకొస్తారని, స్థానిక సంస్థల అభివృద్ధికి సీఎం ఒక్క పైసా కేటాయించలేదని అన్నారు. జైలుకు పంపొద్దని కేంద్రం దగ్గర కేసీఆర్‌ పొర్లుదండాలు పెడుతున్నారని, కేసీఆర్ ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు.