ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటేసినట్లే – బండి సంజయ్

Thursday, March 4th, 2021, 05:52:48 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు. యాదాద్రి-భువనగిరిలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని, సీఎం పదవిని కేసీఆర్ చెప్పుతో పోల్చారని అన్నారు. అసలు కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి 70 వేలు బాకీ ఉందని అన్నారు.

అయితే యాద్రాది లక్ష్మీ‌ నరసింహస్వామి పక్కన కేసీఆర్ తన ఫోటోను ఎప్పుడు పెట్టమన్నాడో అప్పటి నుంచే అయన డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, న్యాయవాద దంపతుల హత్యలో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని, దీనిపై సీఎం కేసీఆర్ స్పందించక పోవడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పట్టభద్ర ఓటర్లందరూ బీజేపీని గెలిపించాలని అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.