వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవ్వడం ఖాయం – బండి సంజయ్

Wednesday, January 6th, 2021, 01:20:59 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ సంచలన ఆరోపణలు చేశారు. నేడు వరంగల్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ కేసీఆర్ మందు తాగి పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. బీజేపీని చూస్తే కేసీఆర్‌కు భయమేస్తోందని అందుకే వరంగల్‌లో ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారని అన్నారు. వరంగల్‌లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో వరద బాధితులకు పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్‌లో ఎందుకు ఇవ్వలేదని అన్నారు. హైదరాబాద్‌లో వచ్చిన ఫలితాలే వరంగల్‌లో కాబోతున్నాయని అన్నారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్ల రూపాయలు ఇస్తే కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆరోపణలు చేశారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్‌లో ప్రమాణానికి నేను సిద్దమని వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణానికి సిద్దమా? 48 గంటల్లో నా సవాల్‌ను స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.