గత్యంతరం లేకనే పీఆర్సీ ప్రకటించారు.. బండి సంజయ్ కామెంట్స్..!

Tuesday, March 23rd, 2021, 01:49:37 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఉద్యోగులకు పీఆర్సీనీ ప్రకటించారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ చేసిన ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటం వల్లన్నే ప్రభుత్వానికి గత్యంతరం లేక పీఆర్సీ ప్రకటించిందని అన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆందోళన చెందిన కేసీఆర్ రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని పీఆర్సీ ఇస్తున్నట్లు చెప్పి వారి చేత ప్రకటనలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఇక ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఉద్యోగులు భావించారని కానీ కేవలం 30 శాతమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను కేసీఆర్ మోసం చేసినట్లే అని బండి సంజయ్ అన్నారు. 2018లో చెప్పిన హామీనీ మూడేళ్ల తర్వాత అమలు చేస్తూ అదేదో గొప్ప చేశామని టీఆర్ఎస్ జబ్బలు చరుచుకోవడం వింతగా ఉందని బండి సంజయ్ అన్నారు. అయితే సీజీహెచ్ఎస్ మాదిరిగా తెలంగాణలో కూడా ఈహెచ్ఎస్‌ను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.