బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి – బండి సంజయ్

Monday, January 4th, 2021, 04:40:55 PM IST

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఖండించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో కూడా రిపీట్ అవుతాయని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురు చూస్తుందని అన్నారు.

అయితే ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని వైసీపీ ప్రభుత్వం మూటముల్లె సర్ధుకునేలా తరిమికొడతామని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, హిందువుల కానుకలు దారి మళ్ళుతున్నాయని ఆరోపించారు. అయితే సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని అన్నారు.