అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ హరీశ్ రావు.. బండి సంజయ్ కౌంటర్ ఎటాక్..!

Saturday, March 27th, 2021, 12:39:55 AM IST


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి హరీశ్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న శాసన సభలో హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా బండి సంజయ్‌ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మణ్డిపడ్డారు. మాట్లాడితే దేశ భక్తి అంటూ మాట్లాడే బండి సంజయ్‌కు స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అయితే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.

నేడ్ మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్‌ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె హరీష్‌‌‌ రావుకు దొరకదా అని ప్రశ్నించారు. హరీష్‌రావు అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని అందుకే దుబ్బాకలో ప్రజలు ఆయన వీపు సాఫ్ చేశారని ఎద్దేవా చేశారు. సీనియర్ అని చెప్పుకునే మంత్రి హరీశ్‌కు శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడదని తెలియదా అని నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే తాను లేఖ రాశానని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే సీఎం కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలబోనని బండి సంజయ్ ప్రకటించాడు. దీనిపై త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చాడు.