భారత్ బంద్‌లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు – బండి సంజయ్

Tuesday, December 8th, 2020, 10:30:21 PM IST

నేడు దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ కూడా మద్ధతు ప్రకటించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు రోడ్లపై భైఠాయించి రైతుల పోరాటానికి మద్ధతు తెలిపారు. అయితే టీఆర్ఎస్ బందుకు పిలుపునిచ్చింది కేవలం గ్రేటర్ ఎన్నికలలో ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

భారత్ బంద్‌కు పిలుపునిచ్చి సీఎం కేసీఆర్‌ ఎందుకు బందులో పాల్గొనలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన బంద్‌ పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలో రైతులు లేని బంద్‌ జరిగిందని ఎద్దేవా చేశారు. అయితే ఉద్యోగుల సమస్యలపై తాను ఉద్యమం చేస్తామని, బీజేపీ ఉద్యమాలకు పోలీసులు సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో నేతలు ఎందుకు మాట్లాడటంలేదని, టీఎన్జీవో నేతలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు.