కేసులకు భయపడేది లేదు.. అరెస్ట్ చేసుకోండి – బండి సంజయ్

Saturday, November 28th, 2020, 07:02:07 PM IST

సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తామని చేసిన వ్యాఖ్యలకు తాను బదులిచ్చానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై కేసులు పెట్టారని, తాము కేసులకు భయపడమని, అరెస్ట్ చేస్తారా చేసుకోండని అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులను చులకన చేసి మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న భారత్‌ బయోటెక్‌ను కేసీఆర్‌ ఎందుకు సందర్శించలేదని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌పై సమీక్షకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తుంటే తనను పిలవలేదని సీఎం కేసీఆర్ అంటున్నారని, మరి ఇన్నిరోజులు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కార్పోరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యారని అందుకే కోవిడ్‌ వ్యాక్సిన్‌ రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ఫార్మ్‌హౌస్‌ నుంచి బయటకురాని సీఎం కేసీఆర్, మోడీ ఎందుకు రాలేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు.