కేసీఆర్‌ను జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం – బండి సంజయ్

Wednesday, March 17th, 2021, 10:00:23 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. హుజూర్‌నగర్‌లో గుర్రంబోడు తండా ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన 20 మంది బీజేపీ నాయకులను బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేసులు కొత్త కాదని, అలాగే జైలుకు పోవడం కూడా కొత్తకాదని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

అయితే సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నామని, కేసీఆర్‌ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుర్రం పోడుతండా ఘటనపై పోలీసుల తీరు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. సర్వేనెంబర్‌ 540లో ఉన్న 6200 ఎకరాల భూమి పూర్తిగా ఆ ప్రాంత గిరిజనులదేనని అన్నారు. గుర్రంపోడు తండాలో బీజేపీ కార్యకర్తలపై తగిలిన లాఠీదెబ్బలకు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బుద్ది చెబుతామని బండి సంజయ్ అన్నారు.