తెలంగాణా వచ్చింది కేసీఆర్ వలన కాదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Tuesday, March 9th, 2021, 07:12:49 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. సూర్యాపేటలోని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డి ఎన్నికల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వలన కాదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఉద్యమాలు, 1200 మంది అమరుల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి, ఆనాడు ఉద్యమకారులపై దాడి చేసిన వారినే ఇప్పుడు కేసీఆర్ తన పక్కన పెట్టుకున్నాడని అన్నారు.

అయితే కార్పొరేట్ విద్యా సంస్థల్లో దొంగ ఓట్లను చేర్పించి వారి డబ్బులతో ఓట్లను కొనే ప్రయత్నం జరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. గెలిచినాక అడ్రస్ లేకుండా పోయినా పల్లాను సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం పోటీ చేస్తే ఆకాంక్షలు నెరవేరవని, ఓట్లు చీలిపోతాయని చెప్పినా వినిపించుకోలేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాక్షస పాలన నుండి తెలంగాణా విముక్తి కోసం మరో ఉద్యమాన్ని బీజేపీ చేస్తుందని పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని కోరారు.