మంత్రి పువ్వాడ అజయ్‌ను జైలుకి పంపిస్తాం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Friday, January 8th, 2021, 04:10:50 PM IST

తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ భూకబ్జాల కోసమే పువ్వాడ అజయ్ ఎర్రజెండా వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ పేరుతో భూములు దోచుకున్న సంగతి ప్రజలందరికి తెలుసని అన్నారు. అంతేకాదు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఎందుకిచ్చారో కూడా తెలుసని అన్నారు.

అయితే మంత్రి పువ్వాడ అజయ్ చేసిన భూ కబ్జాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, మంత్రి అజయ్‌కు కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.