దుబ్బాక, గ్రేటర్‌లో ఓటమితో కేసీఆర్‌కు దిమ్మతిరిగింది – బండి సంజయ్

Friday, January 8th, 2021, 01:35:38 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌, బండి సంజయ్, ఎంపీ అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి, పలువురు నేతలు బీజేపీలో చేరారు. అయితే ఈ సభలో మాట్లాడిన బండి సంజయ్ దుబ్బాక, గ్రేటర్‌లో ఓటమితో కేసీఆర్‌కు దిమ్మతిరిగిపోయిందని అన్నారు.

అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్న ఎంఐఎంతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ వంగి వంగి దండాలు పెట్టినా జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్నారు. టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ప్రజలు ఇకపై నమ్మరని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.