సీఎం కేసీఆర్ పత‌నం ప్రారంభ‌మైంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, January 19th, 2021, 11:59:37 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వ‌రం పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పర్యటనల పేరుతో కేసీఆర్ ప్ర‌జ‌ల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. గ‌త రెండేళ్ళుగా ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎక‌రానికి కూడా నీరు ఇవ్వ‌లేదని, ఎత్తిపోత‌ల విష‌యంలో గ‌త ఏడాది కూడా డ్రామాలాడారని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు టూరిజం స్పాట్‌గా మారుతుందేమో కానీ రైతులకు ఏ మాత్రం ఉప‌యోగప‌డ‌దని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

అయితే కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో కేవ‌లం 17.20 ల‌క్ష‌ల ఎక‌రాలు అని మాత్ర‌మే ఇచ్చారని అన్నారు. కోటి ఎక‌రాల‌కు నీరిస్తామని, ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసి ఇప్పుడు 3వ టీఎంసీ అని కొత్త ముచ్చట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వ‌రం డీపీఆర్ కేంద్రానికి ఇస్తే కేసీఆర్ బండారం బ‌యట‌ ప‌డుతుంద‌ని, డీపీఆర్‌లను కేంద్రం ముందు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో పూజ‌లు చేస్తే చేసిన పాపాలు పోవని ఎద్దేవా చేశారు.