వామనరావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే – బండి సంజయ్‌

Thursday, February 18th, 2021, 12:24:13 AM IST

Bandi-Sanjay
హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వామనరావు దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన అవినీతి చిట్టా వామనరావు దగ్గర ఉందని, ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేయటమే ఆ దంపతుల హత్యకు కారణమని అన్నారు.

వామన్‌రావును ప్రభుత్వ పెద్దలు బెదిరించారని, అయినా లొంగకపోవడంతోనే అడ్డుతొలగించుకున్నారని ఆరోపించారు.
పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వామనరావుకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం‌ లేదని మరోసారి స్పష్టమయ్యిందని బండి సంజయ్ అన్నారు.