అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ అల్టీమేట్ సవాల్..!

Wednesday, November 25th, 2020, 05:10:37 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం వివాదస్పద వ్యాఖ్యలతో హోరెత్తుతుంది. నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత బస్తీలో రోహింగ్యాలు, పాకిస్థానీలు ఉన్నారని బీజేపీ గెలిచిన వెంటనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ చేపడతామని అన్నారు. బండి వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ స్పందిస్తూ బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నామని రోహింగ్యాలు ఎవరో చూపించాలని సవాల్ విసిరారు. ఇక బండి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మండిపడ్డారు. పచ్చని హైదరాబాద్‌ను పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా అని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి హైదరాబాద్ దేశ సరిహద్దుల్లో లేదని కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నేడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయి. 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని అన్నారు. అక్రమ కట్టడాలను కూల్చడం కాదు, హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేస్తామని అన్నారు. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చి చూడు రెండు గంటల్లోపే నీ దారుసల్లాం నేలమట్టం చేస్తామని ఛాలెంజ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.