ప్రమాణం చేస్తావా.. సీఎం కేసీఆర్‌కి బండి సంజయ్ సవాల్..!

Thursday, November 19th, 2020, 12:14:17 AM IST

గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని బీజేపీ అడ్డుకుందని సీఎం కేసీఆర్ మాట్లాడడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజలకు వరదసాయం అందకుండా బీజేపీ అడ్డుకుందని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. వరద సాయాన్ని బీజేపీనే ఆపించిందని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రమాణం చేయాలని అన్నారు.

అయితే వరద సాయాన్ని బీజేపీ అడ్డుకోలేదని భాగ్యలక్ష్మీ దేవాలయంలో తాను ప్రమాణం చేస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు. వరద సాయాన్ని ఆపాలని ఎస్ఈసీకి తాను ఎలాంటి లేఖ రాయలేదని తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తొత్తుగా మారిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలలో 100కు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అన్నారు.