ప్రభుత్వ ప్రమేయం తో పథకం ప్రకారమే వారి హత్య – బండి సంజయ్

Thursday, February 18th, 2021, 11:48:59 AM IST

హైకోర్టు న్యాయవాదులు అయిన గట్టు వామన్ రావు మరియు నాగమణి దంపతుల హత్య రాష్ట్రం లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి- మంతాని రహదారి పై పట్టపగలే నరికి చంపిన ఘటన పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వామన్ రావు తల్లిదండ్రులను బీజేపీ నేతలతో పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియా తో మాట్లాడారు. వామన్ రావు దంపతుల హత్య పై తెరాస నేతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రమేయం తో పథకం ప్రకారమే వామన్ రావు దంపతులను హతమార్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నిందితులను ఎన్ కౌంటర్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు అంటూ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో బయటికి వచ్చాక, ఏ చర్య తీసుకున్నా సమర్దిస్తాం అని, దీని పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.