కేసీఆర్ కొత్త డ్రామా కి తెరలేపారు – బండి సంజయ్

Wednesday, January 27th, 2021, 04:56:23 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిట్ మెంట్ పేరు తో సీఎం కేసీఆర్ కొత్త డ్రామా కి తెరలేపారు అంటూ విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగుల ను మూడేళ్లు ఊరించి ఇప్పుడు ఉసూరమనిపించారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకి ప్రభుత్వానికి మూడేళ్ల సమయం కావాలా అంటూ నిలదీశారు. అయితే ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి, హెచ్ ఆర్ ఎ 6 శాతం తగ్గించాలి అని ప్రతిపాదించడం దారుణం అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజురోజుకీ ఇంటి అద్దె పెరుగుతుంటే హెచ్ ఆర్ ఎ ను తగ్గించాలి అని అనుకుంటారా అంటూ మండిపడ్డారు. అయితే ఉద్యోగులు కోరిన విధంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. పి ఆర్ సి వేసినప్పుడు ఐ ఆర్ ఇవ్వడం సంప్రదాయం అని,కానీ అది ఇవ్వడం లేదు అంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి తో నిరుద్యోగులను, సన్న బియ్యం పేరుతో రైతులను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశారు అంటూ ఆరోపించారు. అసలు సి ఆర్ బిస్వాల్ నేతృత్వం లోని కమిటీ ను రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పని చేయనిచ్చిందా అని, లేదా బలవంతం గా పి ఆర్ సి రాయించారా అంటూ వరుస ప్రశ్నలు వేశారు.