సీఎంఓ ప్రజల కోసమా… కమీషన్ల కోసమా?

Sunday, January 10th, 2021, 09:05:05 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నా, సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మంత్రి పదవులు రాకపోతే తెరాస కి చెందిన పలువురు నేతలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

అయితే కరీం నగర్ వరంగల్ రహదారి కొరకు కేంద్రం నిధులు ఇచ్చింది అని, అయితే టెండర్లు పిలవకుండానే పనులు ప్రారంభించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస నేతలకు కాంట్రాక్టులు ఇస్తున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. అంతేకాక సీఎంఓ ప్రజల కోసం పని చేస్తుందా, కమీషన్ల కోసం పని చేస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి.