కేసీఆర్ తెలంగాణకు పట్టిన వాస్తుదోషం – బండి సంజయ్

Friday, January 8th, 2021, 01:33:15 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన వాస్తుదోషం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల ఉసురు కేసీఆర్ కి తగులుతుంది అని అన్నారు. అయితే బీజేపీ ను ఎదుర్కోవడం కోసం నాగార్జున సాగర్ లో తెరాస మరియు కాంగ్రెస్ పార్టీ లు కలిసి పని చేస్తున్నాయి అని తెలిపారు. అయితే దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్ లో వస్తాయి అని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ భయం తెరాస కి పట్టుకుంది అని అన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి లాంటి క్లిష్ట సమయంలో తెరాస ప్రభుత్వం ప్రజలకు సహాయం లేదు అని అన్నారు. అంతేకాక ఉద్యోగ మరియు విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కేసీఆర్ తో యుద్ధం చేస్తోంది అని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ కి తెరాస చేసిందేమీ లేదు అని,కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడి ప్రజలు తిప్పికొడతారు అని, నాగార్జున సాగర్ లో గెలుపు బీజేపీ దే అంటూ బండి సంజయ్ అన్నారు. 2001 లో టీడీపీ నుండి కేసీఆర్ తన స్వార్థం కోసం బయటికి వచ్చి తెరాసను స్థాపించారు అని, సీఎం కేసీఆర్ నటుడు రాజబాబు మాదిరిగా చేస్తున్నారు అని తెలిపారు. కేసీఆర్ కుర్చీని, సచివాలయం ను ఖాళీ చేయాలని, త్వరలో తెలంగాణ రాష్ట్రం లోకి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు.