సమయం ఇచ్చినట్లయితే 100 స్థానాలు సాధించేవాళ్ళం

Sunday, December 6th, 2020, 09:30:14 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు తో 48 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే గెలిచిన కార్పొరేటర్ లతో బీజేపీ మీడియా సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దే విజయం అని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మరియు ఎం ఐ ఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు.

అభ్యర్ధులను ఖరారు చేసేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించారు అని, సమయం ఇచ్చినట్లు అయితే 100 స్థానాలకి పైగా విజయం సాధించేవాళ్ళం అని అన్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు తెరాస అన్ని ప్రయత్నాలు చేసింది అని బండి సంజయ్ విమర్శించారు. అయితే ప్రజలు అండగా ఉండి బీజేపీ కి 48 స్థానాలు గెలిపించడం ఆనందం గా ఉంది అని తెలిపారు. తక్కువ సమయం ఉన్నా కార్యకర్తలు బాగా పని చేశారు అని, ఎన్నికల కమిషన్ తెరాస చెప్పుచేతల్లో నడిచింది అని అన్నారు. భవిష్యత్ లో ఏ ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం అని తెలిపారు.

ఈ గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం బాగా ఉపయోగపడింది అని అన్నారు. అంతేకాక ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది అని మరొకసారి గుర్తు చేశారు. తెరాస పై ఎంత వ్యతిరేకత ఉందో, బీజేపీ పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఓట్ల శాతాలే చెబుతున్నాయి అని అన్నారు. అయితే గెలిచిన అభ్యర్థులతో త్వరలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటాం అని అన్నారు.