ఏడేళ్లుగా ఎందుకు మాట్లాడలేదు.. సీఎం కేసీఆర్‌కి బండి సంజయ్ సూటి ప్రశ్న..!

Sunday, October 4th, 2020, 03:03:51 AM IST

Bandi-Sanjay

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూటి ప్రశ్న వేశారు. కృష్ణా-గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరు కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు సీఎం కేసీఆర్ నిన్న లేఖ రాశారు. అయితే దీనిపై స్పందించిన బండి సంజయ్ ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు.

ఏడేళ్ళు మౌనంగా ఉండి అపెక్స్ కౌన్సిల్‌కు ముందే లేఖ రాయడం వెనుక అంతర్యమేంటని అన్నారు. గతంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని అన్నారు. రైతుల కోసం కేంద్రం అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ స్వార్థ రాజకీయాల కోసమే సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులు బాగుపడటం కేసీఆర్‌కు ఇష్టం లేదని, రైతు ఎక్కడైనా పంటలను అమ్ముకునే స్వేచ్ఛను వ్యవసాయ చట్టం కల్పిస్తుందని అన్నారు.