పేదరికానికి భయపడొద్దు!

Wednesday, October 8th, 2014, 05:07:02 PM IST

chandhra-babu-naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా శ్యామలాపురంలో నిర్వహించిన ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన డ్వాక్రా మహిళలను ఎంతగానో ప్రశంశించారు. అలాగే పట్టుదలకు మారుపేరు డ్వాక్రా సంఘాల సభ్యులని, వారికి వడ్డీలేని రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పేదవారికి ఎనిమిది వేల కోట్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని బాబు వివరించారు. ఇక మనల్ని చూసి పేదరికం భయపడాలి గాని, పేదరికాన్ని చూసి మనం భయపడకూడదని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ప్రతీ మహిళా ఒక పారిశ్రామికవేత్తగా తయారుకావాలని, మహిళలు ఆదాయం పెరిగే ఆలోచనలు చెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.