బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు..!

Wednesday, September 30th, 2020, 01:20:55 PM IST

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన బాబ్రీ మసీదు తీర్పు వచ్చేసింది. 28 ఏళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఆకస్మికంగా జరిగిందే అని సీబీఐ కోర్టు తేల్చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్ 2000 పేజీల ఆర్డర్ కాపీనీ చదివి తీర్పును వెలువరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగిందని అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసులోని నిందితులంతా నిర్దోషులే అని కోర్టు ప్రకటించి కేసును కొట్టివేసింది.

ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఆడియో, వీడియో ఆధారాలు బలంగా లేవని కోర్టు తెలపింది. అంతేకాదు ఈ కేసులో అభియోగాలు ఎదురుకుంటున్న నిందితులంతా నిర్దోషులే అని తేల్చింది. దీంతో 28 ఏళ్ళ అనంతరం బీజేపీ సీనియర్ నేతలకు ఊరట లభించినట్టయ్యింది. ఇదిలా ఉంటే ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులు ఉండగా అందులో 16 మంది చనిపోయారు. అయితే మిగిలిన 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషితోపాటూ, కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరుకాలేదు. అద్వానీ, జ్యోషీ ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యేందుకు అనుమతి తీసుకున్నారు.