అలా కుదరదా.. వైసీపీకి అల్టీమేట్ కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు..!

Thursday, May 13th, 2021, 01:00:51 AM IST

ఏపీలో వ్యాక్సినేషన్ కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, కౌంటర్ ఎటాక్‌లు నడుస్తున్నాయి. ఏపీలో వ్యాక్సినేషన్ కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలపై మంత్రులు ఆళ్లనాని, అనిల్ కుమార్ వారి వారి స్టెయిల్‌లో కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ భారత్ బయోటెక్‌తో చంద్రబాబుకున్న బంధుత్వాన్ని ఉపయోగించి రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను తెప్పించినా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అనగా, మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామోజీ వియ్యంకులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. చంద్రబాబు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వ్యాక్సిన్లు ఇప్పిస్తే కొనుగోలుకు సిద్ధమే అని అన్నారు.

అయితే వీరి వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మన ఏసీబీ.. సీఐడీని పంపించి సంగం డైరీని స్వాధీనం చేసుకొని అమూల్‌కు అప్పచెప్పినట్లు భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ లను స్వాధీనం చేసుకొని మన వాళ్లకు ఇవ్వడం కుదరదా అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు మన ఏసీబీ, సీఐడీ కృష్ణ ఎల్లా.. పూనావాలాను ఎత్తుకు రాలేరా అని, ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూల్, కడప స్టేషన్లలో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చిపోరా? ఏంది వాళ్ళను అడుక్కొనేది అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు.