నమ్మించి మోసం చేశారు.. వారిని వదలద్దు..!

Friday, September 25th, 2020, 03:20:08 PM IST

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అదే ఏరియాకు చెందిన అవంతి ఇద్దరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్ 10న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించకపోవడంతో గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి బావలు, వదినలు, మామయ్యలు మరికొందరు ఇంటికి వచ్చి తమను తల్లిదండ్రులతో కలుపుతామని నమ్మించి కార్లలో ఎక్కించుకున్నారు. కానీ వాళ్లు మోసం చేస్తున్నారని పసిగట్టి ఇద్దరు కారులో నుంచి దూకేశారు. అయితే మళ్ళీ హేమంత్‌ను పట్టుకుని కొట్టుకుంటూ తీసుకెళ్ళారని, పోలీసులకు సమాచారం ఇచ్చినా వెంటనే స్పందించలేదని అవంతి చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉదయం హేమంత్ హత్యకు గురైనట్టు తేలడంతో భార్య అవంతి, అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమను తల్లిదండ్రులతో కలుపుతామని నమ్మించి తమ బంధువులంతా కలిసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. తన భర్తను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని, ఇక నా తల్లిదండ్రులు చచ్చిపోయారని అనుకుంటానని అవంతి చెప్పుకొచ్చారు.