రాజీనామాలకు సిద్ధమా.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్..!

Tuesday, February 16th, 2021, 01:45:00 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ దీక్ష ఆరో రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్యం మెల్ల మెల్లగా క్షీణిస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో అచ్చన్నాయుడు అత్యవసర సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ గురుంచి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చన్నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ముందుండి పోరాడాలని వారి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేస్తే మేము కూడా చేయడానికి సిద్దమేనని, వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి రెడీగా ఉన్నామని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.