వారి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.. వైసీపీ సర్కార్‌పై అచ్చెన్నాయుడు ఫైర్..!

Thursday, May 13th, 2021, 03:00:47 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుంటే, మరోపక్క ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే ఆక్సిజన్ అందక మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు నేడు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆక్సిజన్ అందక చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, కరోనా నియంత్రనలో వైసీపీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.

అంతేకాదు ఓ ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సూచనలు, సలహాలను ఇస్తే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పెడచెవిన పెట్టారని అన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి కరోనా నియంత్రణలో లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో సర్కార్ శ్రద్ధ వహించాలని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ 10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.