అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు – అచ్చెన్నాయుడు

Tuesday, March 16th, 2021, 12:58:45 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కక్ష సాధింపు లో భాగం గానే చంద్రబాబు కు సీఐడీ నోటీసులు ఇచ్చారు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అసైన్డ్ భూములను రైతుల ఆమోదం తో తీసుకుంది రాజధాని కోసమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసు వేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ నా లేక ఎస్టీ నా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు ఎలా పెడతారు అంటూ నిలదీశారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతో నే చంద్రబాబు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీ నే ఇచ్చామని చెప్పుకొచ్చారు. అంతేకాక ల్యాండ్ పూలింగ్ 2015 లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. దశాబ్దాల తరబడి ఇడుపుల పాయ లో 700 ఎకరాల అసైన్డ్ భూములను 30 ఏళ్లు అనుభవించారు అని, ఆ విషయం కాస్త బయట పడటం తో 610 ఎకరాల భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను అని అసెంబ్లీ లో జగన్ చెప్పిన విషయాలను వెల్లడించారు.అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007 లో సవరించి ఆర్డినెన్సు ద్వారా అమల్లోకి తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా అంటూ అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు కి సిఐడి అధికారులు నోటీసులు అందించడం పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.