అందుకే స్థానిక ఎన్నికలకు వైసీపీ నో చెబుతుంది – అచ్చెన్నాయుడు

Saturday, October 24th, 2020, 02:10:47 AM IST


ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం జరగలేదు. అయితే కరోనా కారణంగా గతంలో ఎలక్షన్ కమీషన్ ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఆయనను పదవి నుంచి కూడా తప్పించింది.

అయితే నిమ్మగడ్డ దీనిపై కోర్టుకు వెళ్ళడంతో తిరిగి ఆయనను గవర్నర్ ఎస్ఈసీగా నియమించారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి రావడంతో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమీషన్ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని మళ్ళీ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన లేదంట్టు వ్యవహరిస్తుంది. అయితే స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందుకే స్థానిక ఎన్నికలకు వైసీపీ వెనుకంజ వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గిందని స్థానిక ఎన్నికలు పెట్టేందుకు ఈసీ చూస్తుంటే దానికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు.