కరోనాతో బాగా ఇబ్బందిపడ్డా.. నెటిజన్లతో అనుభవాలు పంచుకున్న మంత్రి కేటీఆర్..!

Friday, May 14th, 2021, 02:00:22 AM IST

ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా నేడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ నెటిజన్ల నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుందని అన్నారు. అయితే వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని కానీ వ్యాక్సిన్ ఉత్పత్తే ఇప్పుడు అడ్డంకిగా మారిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 45 ఏళ్లకు పైబడి సుమారు 92 లక్షల జనాభా ఉంటే అందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందని, మరో పది లక్షల మందికి పైగా రెండవ డోసు కూడా పూర్తయిందని అన్నారు.

ఇకపోతే రాష్ట్రంలో లాక్‌డౌన్ సమర్థవంతంగానే కొనసాగుతోందని, ప్రజల అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించామని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని, సరఫరా విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ఇక కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఇక కరోనాను ఎదురుకోవడంలో సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్యులు, నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని సూచించారు. మానసికంగా బలంగా ఉండాలని, సోషల్ మీడియా, టీవీలలో వచ్చే అసత్యాలను పరిగణలోకి తీసుకోకూడదని అన్నారు. తనకు కరోనా వచ్చిన సమయంలో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని, తాను డయాబెటిక్ అయినందు వల్ల బాగా ఇబ్బందిపడ్డానని వైద్యుల సూచనతో దానిని అధిగమించానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.