ఏపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ ‌గజపతిరాజు..!

Friday, January 29th, 2021, 03:00:19 AM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ ‌గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్ధం ఘటన అనంతరం ఆ ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ ‌గజపతిరాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రామతీర్థం రామాలయంతో పాటు విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి కూడా ఆయనను తప్పించింది. దీనిపై అశోక్ ‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే తాజాగా ప్రభుత్వ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. అశోక్ ‌గజపతిరాజు తిరిగి ధర్మకర్తగా ఉండొచ్చని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్‌ గజపతిరాజు మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు. అయితే దేశంలో రాజ్యాంగం, చట్టాలున్నాయని జగన్ ప్రభుత్వానికి కనీస ఆలోచన లేదన్నారు. మానసికంగా, పరిపాలన పరంగా తమను వేధించాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సింహాచలం దేవస్థానం పరిధిలో గోవులకు దాణా వేయకుండా హింసా పాపాన్ని మూటగట్టుకున్నారని అన్నారు.