ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. చర్చించిన ప్రధాన అంశాలు ఇవే..!

Tuesday, October 6th, 2020, 07:34:42 PM IST

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై నేడు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్, ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. అయితే దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్టు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.

అయితే కొత్త ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లను సమర్పించాలని, డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా అంగీకరించినట్టు షెకావత్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందని అందులోనే భాగంగా కృష్ణా నదీ జలాల బోర్డు ఏర్పాటైందని అన్నారు. అంతేకాదు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం కేవలం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరిందని, ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు జరగాలని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిపారు. డీపీఆర్‌లు పరిశీలించి అపెక్స్‌ కౌన్సిల్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని, నదీ జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు.