చంద్రబాబు పర్యటన చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారు – అచ్చెన్నాయుడు

Monday, March 1st, 2021, 01:30:08 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు రేణిగుంట విమానాశ్రయం వద్ద నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి పక్ష నాయకుడి కి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యం లో గృహ నిర్భంధం చేసిన తెలుగు దేశం పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అయితే వేలాది మంది తో సమావేశాలు, సభలు, ర్యాలీ లకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయి అన్న భయంతోనే అనుమతి ఇవ్వడం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పర్యటన చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు వణికిపోతున్నారు అంటూ విమర్శించారు. ప్రజా క్షేత్రంలో నే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ను గూండా గిరిని ప్రజలకు వివరిస్తాం అని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన పై ప్రజలు విసిగెత్తారు కాబట్టే టీడీపీ నేతలను ఇళ్ళల్లో నిర్బందిస్తున్నారు అని, నిర్బంధించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలనీ చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జగన్ రెడ్డి కి బుద్ది చెప్పడం ఖాయం అని అన్నారు.